అవకాడో లేదా వెన్న పండు అనేది మధ్య మెక్సికో ప్రాంతానికి చెందిన ఫలవృక్షం. దీని శాస్త్రీయ నామం పెర్సీ అమెరికాన (Persea americana). పుష్పించే తరగతికి సంబంధించిన ఈ చెట్టు లారేసి (Lauraceae) కుటుంబానికి చెందినది. ఈ వృక్షం ఫలించే కాయను వెన్న పండు అని అంటారు. ఆంగ్లంలో వెన్న పండును ఎవకాడో (Avocado) లేక అల్లెగటర్ పీయర్ (Allegator Pear) లేక బటర్ ఫ్రూట్ (Butter Fruit) అని అంటారు. కాయలు ఆకుపచ్చగా గాని లేదా నల్లగా గాని ఉంటాయి. మెత్తగా తినడానికి కొద్దిగా ఆవు వెన్న రుచిగానూ, కొద్దిగా చిరు చేదుగానూ ఉంటాయి. అందువలన వెన్నపండు అని అనడం కద్దు. వెన్న పూస దొరకని సమయాల్లో పసి పిల్లలకు వెన్న పండు అతి శ్రేష్టమైన ఆహారం. దీని మధ్య గల గింజలను పలు ఔషధాలలో వాడుతుంటారు.
ఈ కాయల వాడుక క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాలనుండి ఉంది. దక్షిణ, మధ్య అమెరికాలో క్రీస్తు శకం 900 సంవత్సరాలనుండి వెన్న పండు సాగు ఉంది. 1518-19 లో మార్టిన్ ఫెర్నాండెజ్ డి ఎన్సికొ అనే రచయిత తన పుస్తకంలో మొదటిసారిగా వెన్న పండు గురించి పేర్కొన్నాడు [1][2].
వెన్న పండు చెట్టు సుమారు 20 మీటర్లు (66 అడుగులు ) ఎత్తు ఎదుగుతుంది. 12 సెంటీమీటర్ల నుండి 25 సెంటీమీటర్ల పొడవుతో ఆకులు, 5 నుండి 10 మిల్లీమీటర్ల వెడల్పుతో పువ్వులు, 7 నుండి 7.9 అంగుళాల పొడవు గల కాయలు కలిగి ఉంటుంది. దాల్చినచెక్క, కర్పూర చెట్టు, బే లౌరెల్ చెట్లు అవకాడో చెట్టుకు సమీప పోలికలున్న చెట్లు. అవకాడో లేక మొసలి బేరి పండు చెట్టు యొక్క పండు లోపల మధ్య భాగంలో ఒకే ఒక విత్తనాన్ని కలిగి ఉంటుంది. ఈ చెట్టు యొక్క పండు ఒక వైపు సన్నగా మరొక వైపు లావుగా బేరి పండు వలె, అండాకారం తోను, గోళాకారంలోను ఉంటాయి. అవకాడో వ్యాపారపరంగా మంచి విలువగల పంట కాబట్టి ఈ పంటకు సరిపడ వాతావరణం గల ప్రపంచంలోని అన్ని శీతోష్ణ, సమశీతోష్ణ మండలాలలో ఈ చెట్లను పెంచుతున్నారు. ఈ చెట్టు యొక్క పండు పరిపక్వానికి వచ్చి కోతకు వచ్చిన సమయంలో బాగా కండను కలిగి ఆకుపచ్చ రంగు తోలుతో విత్తనం తీసేసిన ముంత మామిడి కాయ ఆకారంలో ఉంటుంది.
వెన్నపండ్లను సారవంతమైన ఎర్ర్ర నేలల్లో సాగు చేయవచ్చు. వెన్న చెట్లను పెరూ, పోర్చుగీస్, మొరొకొ, క్రెతె, లెవాంట్, దక్షిణ ఆఫ్రికా, కొలంబియా, చిలీ, వియత్నాం, ఇండొనేషియా, శ్రీలంక, దక్షిణ భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, మలేషియా, మధ్య అమెరికా, కరేబియన్, మెక్సికో, కాలిఫోర్నియా, అరిజోనా, ప్యూర్టో రికో, న్యూ మెక్సికో, టెక్సాస్, ఫ్లోరిడా, హవాయి, ఈక్వేడర్, మరియూ ర్వాండా దేశాల్లో సాగు చేస్తున్నారు.
విత్తనం నాటిన 4 నుండి 6 సంవత్సరాలకు వెన్న చెట్లు కోతకు వస్తాయి. వెన్న పండ్లు సాధారణంగా చెట్టున ఉన్నప్పుడే ముగ్గుతాయి. కాని వాణిజ్యంగా పండించేవారు వీటిని పచ్చిగానే ఉన్నప్పుడు కోసి 3.3 నుండి 5.6 సెంటీగ్రేడ్ల వద్ద ముగ్గడం కోసం భద్రపరుస్తారు.
చొక్వెట్, హాస్, గ్వెన్, లుల, పింకర్టన్, రీడ్, బెకాన్, బ్రాగ్డెన్, ఏట్టింగర్. ఇందులో నలుపు రంగులో కనిపించే హాస్ రకం మార్కెట్లో ఎక్కువగా లభ్యమవుతుంది.
వెన్న పండులో అధిక శాతం క్రొవ్వు ఉంటుంది. అందుచేత వెన్న పండు గుజ్జును హోటళ్లలో చికెన్, ఫిష్, మటన్ కూరల్లో, సాండ్ విచ్చెస్, సలాడ్లలోను ఉపయోగిస్తారు. వెన్న దొరకని సమయాల్లో పసి పిల్లలకు వెన్న పండు గుజ్జుని తినిపించవచ్చు. ఫిలిప్పీన్స్, బ్రెజిల్, వియత్నాం, దక్షిణ భారత దేశాల్లో ఐస్ క్రీములలోను, డెస్సర్ట్స్ లోను వాడుతారు. వెన్న పండు గుజ్జును పంచదార కలిపిన పాలలో లేదా పంచదార కలిపిన నీరులో కలిపి జ్యూస్ గా సేవించవచ్చును. వెన్న పండు గుజ్జు ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించి హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కేన్సర్,, మధుమేహం, హైపర్ టెన్షన్ లను అదుపు చేసే లక్షణం కూడా వెన్న పండుకు ఉంది. అవకాడో అధిక స్థాయిలో పొటాషియం కలిగి ఉంటుంది. ఇది రక్త పీడనం సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అవకాడొలు ఫోలిక్ ఆమ్లం కలిగి ఉంటాయి, క్యాలిఫార్నియ అవోకాడో కమిషన్ ప్రకారం గర్బవతులు ఇది తినడము వలన పుట్టుకతో వచ్చే spina bifida and neural tube defects నిరోధిస్తుంది
వెన్న పండు నుంచి లభించే శక్తి 75 శాతం క్రొవ్వునుండే లభిస్తుంది. 100 గ్రాముల వెన్న పండు గుజ్జులో 160 కిలో కేలరీల శక్తి ఉంటుంది, 485 మిల్లీ గ్రాముల పొటాషియం లభిస్తుంది. బి, ఇ, కే విటమిన్లు కూడా లభిస్తాయి. పీచు పదార్థం 75 శాతం,, 25 శాతం సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది.
వెన్న పండు అరుదుగా కొందరిలో తాత్కాలికంగా తేలికపాటి ట్రీ-పాలిన్ (Tree-pollen), లాటెక్స్ ఫ్రూట్ సిండ్రొం (latex-fruit syndrome) (అనగా దురదలు, వాంతులు, నడుము నొప్పి) వంటి ఎలర్జీలకు కారణం అవవచ్చును. కాని వెన్న పండు ఏమాత్రము ఆరోగ్యానికి హానికరము కాదు. వెన్న చెట్టు ఆకులు, బెరడు ఆవులకు, గేదెలకు, కుక్కలకు, పిల్లులకు, మేకలకు, కుందేళ్ళకు, పక్షులకు, చేపలకు, గుర్రాలకు విషపూరితం [3][4].
అవకాడో లేదా వెన్న పండు అనేది మధ్య మెక్సికో ప్రాంతానికి చెందిన ఫలవృక్షం. దీని శాస్త్రీయ నామం పెర్సీ అమెరికాన (Persea americana). పుష్పించే తరగతికి సంబంధించిన ఈ చెట్టు లారేసి (Lauraceae) కుటుంబానికి చెందినది. ఈ వృక్షం ఫలించే కాయను వెన్న పండు అని అంటారు. ఆంగ్లంలో వెన్న పండును ఎవకాడో (Avocado) లేక అల్లెగటర్ పీయర్ (Allegator Pear) లేక బటర్ ఫ్రూట్ (Butter Fruit) అని అంటారు. కాయలు ఆకుపచ్చగా గాని లేదా నల్లగా గాని ఉంటాయి. మెత్తగా తినడానికి కొద్దిగా ఆవు వెన్న రుచిగానూ, కొద్దిగా చిరు చేదుగానూ ఉంటాయి. అందువలన వెన్నపండు అని అనడం కద్దు. వెన్న పూస దొరకని సమయాల్లో పసి పిల్లలకు వెన్న పండు అతి శ్రేష్టమైన ఆహారం. దీని మధ్య గల గింజలను పలు ఔషధాలలో వాడుతుంటారు.