dcsimg

పెండలం ( Telugu )

provided by wikipedia emerging languages

ద్వినామ పద్ధతిలో మనకి తరచుగా తారసపడే పెండలం యొక్క శాస్త్రీయ నామం Dioscorea alata. దీనికి తెలుగులో ఇతర పేర్లు: దుక్క పెండలం (లేదా, పెద్ద పెండలం), గున్న పెండలం (లేదా, చిన్న పెండలం), కవిలి గడ్డ.

ఇతర భాషలలో పేర్లు

  • పెద్ద పెండలాన్ని సంస్కృతంలో "ఆలూకం" అనీ పిండాలు (పిండ + ఆలు) అనీ అంటారు. ఈ రెండవ మాట నుండే "పెండలం" వచ్చింది.
  • హిందీ: ఛుప్రీ ఆలు, ఖమాలు, కన్నడ : తెన్గుగెనసు, హెగ్గెనసు, మలయాళం : కాసిల్, కావుట్టు, తమిళం : కస్టన్ కాసిల్,
  • ఆంగ్లము: పెద్ద పెండలాన్ని "గ్రేటర్ యాం," అనిన్నీ "ఏషియాటిక్ యాం" అనిన్నీ అంటారు. శాస్త్రీయ నామం డయాస్కోరీయా అలాటా (Dioscorea alata). అలాటా అంటే రెక్కలు కలది అని అర్థం.
  • చిన్న పెండలాన్ని "లెస్సర్ యాం" అంటారు. శాస్త్రీయ నామం డయాస్కోరీయా ఎస్కులెన్‌టం (Dioscorea eskulentum). ఎస్కులెన్‌టం అంటే ఆహారంలా తినడానికి అనువైనది అని అర్థం.

మొక్క వర్ణన

తీగ జాతికి చెందిన ఏకవార్షిక మొక్క ఇది. తమలపాకు తీగ మాదిరి ఈ తీగ చెట్ల పైన, నేల పైన పాకుతుంది. ఈ తీగ కాండానికి - బీరకాయకి ఉన్నట్లు - నాలుగు రెక్కలు ఉంటాయి. ఈ తీగకు దూరం దూరంగా పెద్ద ఆకులు ఉంటాయి. అవి హృదయాకారంలో మొదలు వెడల్పుగా, కొస సన్నగా, కోలగా పొడుగ్గా ఉంటాయి. తీగ మీద ఆకులు ఎదురెదురుగా ఉంటాయి. తీగ బాగా ముదిరితే ఎర్రటి కాయలు కాస్తాయి. నేలలో పొడుగుగా దుంపలు ఊరుతాయి. దుంపలపై మందపాటి ముదురు గోధుమ రంగు చర్మం ఉంటుంది. లోపలి భాగం తెల్లగా, కొద్దిపాటి జిగటగా ఉంటుంది. పెద్ద పెండలం తీగ కుడి వైపుకి అల్లుకుంటూ పెరిగే తీగయితే, చిన్న పెండలం తీగ ఎడమ వైపుకి అల్లుకుంటూ పెరుగుతుంది. ఈ లక్షణాన్ని బట్టి మొత్తం పెండలం జాతిని స్థూలంగా రెండు వర్గాలుగా విభజించేరు.

జన్మస్థానం

ఆఫ్రికా ఖండపు పశ్చిమ కోస్తాలో ఉన్న మాండే భాషలో పెండలాన్ని "నియాం" అంటారుట. అందులోంచే ఇంగ్లీషు మాట "యాం" (yam) వచ్చింది. ఇది ఆఫ్రికా ఖండం నుండి భారత దేశానికి 26 మిలియన్లు సంవత్సరాల కిందటే (అంటే మానవ జాతి ఆవిర్భావానికి ముందే) వలస వచ్చిందని శాస్త్రవేత్తల అభిప్రాయం. అయినప్పటికీ నేడు భారతదేశంలో విస్తారంగా పెరిగే పెండలం జాతులన్నీ బర్మా, థాయిలాండ్ దేశాల నుండి వచ్చేయని అభిప్రాయపడుతున్నారు.

పెండలం సాగు

సాధారణంగా పెండలాన్ని అంతర పంటగా సాగు చేస్తారు. అనగా అల్లం, పసుపు, చిలగడ దుంప వగైరా నాటిన పొలాలలోనే, మధ్యలో ఉన్న ఖాళీలలో పెండలాన్ని వేస్తారు. లోతుగా దున్నిన భూమి, మంచి ఎరువు, తేమ ఉన్న నేల ఉన్న చోట్ల పెండలం బాగా దిగుబడి ఇస్తుంది. అయినా పొలంలో నీరు నిల్వ ఉండకుండా మంచి మురుగు నీటి పారుదల ఉండాలి, పెండలం దుంపల పై భాగం కోసి నాటితే మొలకలు వస్తాయి. వాటిని పందిళ్ల మీదకి ఎక్కిస్తారు. భారత దేశంలో దరిదాపు అన్ని ప్రాంతాలలోనూ పెండలం సాగు చేస్తున్నారు. ప్రపంచంలోని మొత్తం పెండలం పంటలో 96 శాతం ఆఫ్రికా ఖండం లోనే!

ఆహారంగా పెండలం

పెండలంలో 21 శాతం పిండి పదార్థాలు (starches), 73 శాతం నీరు. పెండలాన్ని ముక్కలుగా కోసి, నూనెలో వేయించి కాని, ఉడకబెట్టి తాలింపు వేసి కాని, ఎండబెట్టి పొడి చేసి కాని వాడుతారు. కరువు కాలంలో పెండలమే ఆహారంగా ఆదుకుంటుంది. నాణ్యమైన పెండలాలు రుచికి బంగాళా దుంపలతో పోటీ పడతాయి.

కొన్నిరకాల పెండలాలలో ఆక్జలేట్లు ఉన్న కారణంగా అవి విష పదార్థాలు అవుతాయి. ఉడకబెట్టినా, కాల్చినా, వేయించినా విషతుల్యమైన క్షారార్థాలు (alkaloids) నశిస్తాయి. పెండలం ఓని పిండి పదార్థాలని ముడిసరుకుగా వాడి ఆల్కహాలు తయారు చెయ్యవచ్చు.

ఆయుర్వేదంలో పెండలం

ఆయుర్వేద వైద్యుల అభిప్రాయం ప్రజకారం పెండలం దుంపలు చలవ చేస్తాయి. బలవర్థకము. వీర్యవృద్ధి, కామాన్ని పెంచుతుంది. మూత్రము సాఫీగా అయ్యేటట్లు చేస్తుంది. కడుపులో పురుగులను చంపుతుంది. మేహశాంతి కలిగిస్తుంది. దాహాన్ని తగ్గిస్తుంది. పిత్త రోగములపై పనిజేయును. మధుమేహము, కుష్టు, గనేరియా, మూత్రము బొట్లు బొట్లుగా అగుటను మాన్పును. కాయలు కూర చేసుకొని తినిన దేహ పుష్టి, బలమును కలిగిస్తుంది.

ఆధునిక వైద్యంలో పెండలం

కొన్ని రకాల పెండలం జాతుల నుండి తయారు చేసిన "స్టీరాయిడ్ సేపోజెనిన్" అనే ఘృతార్థాలని (steroids) గర్భ నిరోధక మాత్రల తయారీలో వాడుతున్నారు.

ఇవి కూడా చూడండి

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు