సొలనేసి కుటుంబంలో సుమారు 85 ప్రజాతులు, 10000 జాతులు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉష్ణమండల ప్రదేశాలలో వ్యాపించి ఉన్నాయ?
కుటుంబ లక్షణాలు
- ఇవి సాధారణంగా మధ్యరకం మొక్కలు. కొన్ని ఎడారిమొక్కలుగా పెరుగుతాయి (ఉ. సొలానమ్ సూరతైన్స్).
- ఎక్కువగా ఏకవార్షిక లేదా బహువార్షిక గుల్మాలు. కొన్ని పొదలు (ఉ.సెస్ట్రమ్), అరుదుగా వృక్షాలు.
-
వేరు: తల్లి వేరు వ్యవస్థ.
-
కాండం: వాయుగతం, నిటారుగా పెరుగుతుంది. గుల్మాకారం, కాండాన్ని కప్పుతూ కేశాలుగాని, ముళ్ళుగానీ ఉంటాయి. బంగాళాదుంపలో భూగర్భంగా పెరిగే దుంపకాండం ఉంటుంది. సాధారణంగా పత్రవృంతం కాండంతో ఆశ్లేషితం చూపిస్తుంది. కాండంలో ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు కనిపిస్తాయి.
-
పత్రాలు: పుచ్ఛరహితం, వృంతసహితం. శాఖీయ భాగాలలో ఏకాంతరంగా ఉంటాయి, కాని పుష్పవిన్యాసాల దగ్గర పత్రవృంతం కణుపు మధ్యమంతో సంయుక్తం కావడం వల్ల అభిముఖంగాగాని, చక్రీయంగాగాని అమరి ఉంటాయి. సాధారణంగా సరళ పత్రాలు లేదా తమ్మెలలాగా చీలి ఉంటాయి. జాలాకార ఈనెల వ్యాపనం.
-
పుష్ప లక్షణాలు:
- నిశ్చిత పుష్పవిన్యాసం.
- పుష్పాలు పుచ్ఛసహితం లేదా పుచ్ఛ రహితం, లఘుపుచ్ఛరహితం, వృంతసహితం, సౌష్టవయుతం, సంపూర్ణం, ద్విలింగకం, పంచభాగయుతం.
- రక్షకపత్రాలు 5, సంయుక్తం, కవాటయుత పుష్పరచన.
- ఆకర్షణపత్రాలు 5, సంయుక్తం, కవాటయుత లేదా మెలితిరిగిన పుష్పరచన.
- కేసరావళి 5, మకుటదళోపరిస్థితం, ఆకర్షణపత్రాలతో ఏకాంతరంగఅ ఉంటాయి. పరాగకోశాలు పెద్దవి. ద్వికక్షికం, పీఠసంయోజితం, అంతరోన్ముఖం.
- అండకోశం ద్విఫలదళ్ సంయుక్తం. పరాంతంలో ఉండే ఫలదళం కుడివైపుకు, పూర్వాంతంలో ఉండే ఫలదళం ఎడమవైపుకు 45 కోంలో మెలితిరిగి ఉంటాయి. అండాశయం సాధారణంగా ద్విబిలయుతం, కాప్సికమ్ లో ఏకబిలయుతం, ఉమ్మెత్త లో అనృతకుడ్యం ఏర్పడడం వల్ల చతుర్బిలయుతం అవుతుంది. ఉబ్బిన అండన్యాసస్థానంపై అనేక అండాలు స్థంభ అండన్యాసంలో అమరి ఉంటాయి. అగ్రకీలం, కీలాగ్రం శీర్షాకారం.
-
పరాగసంపర్కం: కీటకాల ద్వారా పర పరాగసంపర్కం జరుగుతుంది. పొగాకులో ఆత్మ పరాగసంపర్కం జరుగుతుంది.
-
ఫలం: ఎక్కువగా మృదుఫలం. ఉమ్మెత్త, పొగాకు లలో పతభేదక గుళిక.
-
విత్తనాలు: అంకురచ్ఛదయుతాలు, బీజదళాలు రెండు, సాధారణంగా పిండాలు వంపు తిరిగి ఉంటాయి. పొగాకులో నిటారుగా ఉంటాయి.
ఆర్థిక ప్రాముఖ్యం
- సొలానమ్ ట్యూబరోసమ్ (బంగాళాదుంప) దుందకాండాన్ని, సొలానమ్ మెలాంజిన (వంకాయ), లైకోపెర్సికాన్ ఎస్కులెంటమ్ (టమాటో), కాప్సికమ్ ఫ్రూటిసెన్స్ (మిరప) మృదుఫలాలను కూరగాయలుగా వాడతాలు.
- కాప్సికమ్ ఫ్రూటిసెన్స్ లో 'కాప్సిన్' (Capsaicin) అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఎండబెట్టిన మిరపకాయల పొడిని (కారం) పచ్చళ్ళ తయారీలోను, వంటలలోను వాడతారు.
- వాణిజ్య పంట అయిన నికోటియాన టబాకమ్ (పొగాకు) పత్రాలలో 'నికోటిన్' (Nicotine) అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. వీటి పత్రాలను చుట్టలు, సిగరెట్లు మొదలైన వాటి తయారీలో వాడతారు.
-
ఉబ్బసము వ్యాధి (ఆస్థమా) నయం చేయడానికి సొలానమ్ సూరతైన్స్, దతూర స్ట్రామోనియమ్ ఆకులు ఉపయోగపడతాయి.
- అట్రోపా బెల్లడోన లో 'అట్రోపిన్' (Atropine) అనే పదార్థం ఉంటుంది. దీవికి వైద్యంలో వివిధరకాలైన ఉపయోగాలున్నాయి.
- విథానియా సోమ్నిఫెరా (అశ్వగంధి) వేళ్ళ నుంచి బలవర్ధకమైన టానిక్ తయారుచేస్తారు.
- సొలానమ్ నైగ్రమ్ (కామంచి) ఫలాలకు ఔషధ గుణం ఉంది.
-
ఫైసాలిస్ ఫలాలను తింటారు.
-
సెస్ట్రమ్, పెటూనియా జాతులను అలంకరణ కోసం పెంచుతారు.
ముఖ్యమైన మొక్కలు
మూలాలు
- బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.