సైకస్ (ఆంగ్లం Cycas) ఒక రకమైన వివృతబీజాలు. సైకస్ ప్రజాతిలో ఇంచుమించు 95 జాతుల్ని గుర్తించారు. సైకస్ పేరు కైకస్ గ్రీకు లో 'పామ్ చెట్టు' అని అర్ధం. ఇవి పామే కుటుంబానికి చెందినవి కావు.
సైసక్ ప్రజాతి మొక్కలు ప్రపంచంలో ఉష్ణ మండల ప్రాంతాల్లో వన్యంగా కనిపిస్తుంది. ఇవి జలాభావ, ఎడారి పరిస్థితుల్లో పెరుగుతాయి. భారతదేశంలో నాలుగు సైకస్ జాతులు పెరుగుతున్నాయి. అవి దక్షిణ భారతదేశంలో సైకస్ సిర్సినాలిస్ (క్రోజియర్ సైకస్), తూర్పు కనుమల్లో సైకస్ బెడ్డోమి (మద్రాస్ సైకస్), తూర్పు భారతదేశంలో సైకస్ పెక్టినేటా (నేపాల్ సైకస్), అండమాన్, నికోబార్ దీవుల్లో సైకస్ రంఫై (రంఫియస్ సైకస్). జపాన్ సైకస్ జాతి అయిన సైకస్ రెవల్యూటా (సాగో సైకస్)ను అందంకోసం పెంచుతున్నారు.
సైకస్ సిద్ధబీజదం అబ్బురపు మొగ్గలు లేదా లఘులశునాల వల్ల శాకీయోత్పత్తిని జరుపుతుంది. లఘులశునాలు కాండం పీఠభాగాల్లో అభివృద్ధి చెందుతాయి. వీటిలో దుంపవంటి కాండం, కొన్ని పత్రాలు ఉంటాయి. లఘులశునం నేలపై పడితే అబ్బురపు వేళ్ళను ఏర్పరచుకొని స్వతంత్రమైన మొక్కగా పెరుగుతుంది. సిద్ధబీజదం సుమారు పది సంవత్సరాలపాటు శాకీయ పెరుగుదల తరువాత విత్తనాలవల్ల ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. సైకస్ మొక్కలు భిన్న సిద్ధబీజత ఉన్న ఏకలింగాశయులు. ఇవి అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకొని సూక్ష్మసిద్ధబీజాలు, స్థూలసిద్ధబీజాలు అనే రెండురకాల సిద్ధబీజాలను వేరువేరు మొక్కలపై ఉత్పత్తి చేస్తాయి.